4, జులై 2020, శనివారం

పుస్తకం ఆత్మ వాళ్ళకు తెలుసు
కరోనా విపత్తు కాలంలో అనేక రంగాలు సంక్షోభానికీ, ఒత్తిళ్ళకు లోన య్యాయి. పుస్తకాలు ప్రచురించేవారు, అమ్మేవారు కూడా ఇందుకు మినహాయింపు కాదు. లాక్‌డౌన్‌ కాలంలో అన్నిటితో పాటు పుస్తకాల షాపులు కూడా మూతబడినాయి. అమ్మకాలు నిలిచిపోయాయి. ఈ నేపథ్యంలో మరి తెలుగు నాట పుస్తకాల షాపుల పరిస్థితి ఏమిటి? ఈ మధ్యన నవోదయ బుక్‌ హౌస్‌కు వెళ్ళినపుడు సాంబశివరావు గారిని అడిగాను. కాస్సేపు పుస్తకాలు, పాఠకులు, కరోనా కాలంలో ప్రచురణకర్తల, పుస్తకాల షాపుల, డిస్ట్రిబ్యూటర్ల పరిస్థితి గురించి మాట్లాడుకున్నాం.
మార్చి 22న లాక్‌డౌన్‌ ప్రకటించిన తరువాత మే పదిహేను వరకు తాము ఇంట్లోనే ఉండిపోయినట్టు సాంబశివరావు చెప్పారు. సాధారణంగా మార్చిలో పుస్తకాల స్టాక్‌ పొజిషన్‌ చూసి రచయితలకు, ప్రచురణకర్తలకు డబ్బులు చెల్లించడం ఆనవాయితీ. దాదాపు పదిహేను రోజుల పైనే ఈ పని ఉంటుంది. ఆకస్మికంగా లాక్‌డౌన్‌ ప్రకటించడంతో ఇంటికి పరిమితమవ్వాల్సి వచ్చింది. అయితే ఆన్‌లైన్‌లో దాదాపు రెండువందల మంది పుస్తకాలకు ఆర్డర్‌ పెట్టారు. వెంటనే పంపడం కుదరదు కాబట్టి, లాక్‌డౌన్‌ అనంతరమే పంపిస్తామని అందరికీ మెయిల్‌ పెట్టినట్టు చెప్పారు. తీరిక సమయం వున్నందున ఈ సమయంలో పుస్తకాలు చదివే అవాటు పెరిగింది. ఇది మంచి పరిణామం. కరోనా కాలంతో సంబంధం లేకుండా చూసినా, తెలుగులో పాఠకులు ఉన్నారు. నేరుగా వచ్చి కొనలేకున్నా, ఆన్‌లైన్‌లో తెలుగు పుస్తకాలు తెప్పించుకునే వారి సంఖ్య పెరుగుతున్నది. లాక్‌డౌన్‌ పీరియడ్‌లో చాలామంది పుస్తకాల కోసం ఫోను చేశారు. ఆన్‌లైన్‌లో ఆర్డర్లు పెట్టారు. వారందరికీ ఇపుడు పంపించామన్నా రాయన. మే 15వ తేదీన మరల షాపు తాళాలు తీశారు. తొలుత స్టాక్‌ పొజిషన్‌కు సంబంధించిన అంచనా పనిలో పదిహేను రోజులు నిమగ్నమ య్యారు. జూన్‌ ఒకటో తేదీ నుంచి వినియోగదారుల కోసం తెరిచి వుంచారు. అప్పట్నించి నవోదయ యధావిధిగా పని చేస్తున్నది.
హైదరాబాద్‌లో 1990 నుంచి నవోదయ బుక్‌హౌస్‌ నడుస్తున్నది. ఈ ముప్పయ్యేళ్ళలో ఇంత ఎక్కువ కాలం (లాక్‌డౌన్‌ సమయం) షాపు మూసేయడం ఇదే మొదటిసారి అన్నారు సాంబశివరావు. దీంతో నిర్వహణా ఇబ్బందులు, సమస్యలు ఉంటాయి, అయినప్పటికీ ఈ సమయాన సిబ్బందికి పూర్తి కాలం వేతనాలు చెల్లించినట్టు చెప్పారు.
‘నవోదయ’ని 1990లో ఆరంభించినప్పటికీ అంతకు ముందు 1974 నుంచే సాంబశివరావు గారికి పుస్తకాల సేల్స్‌తో సంబంధం వుంది. సుల్తాన్‌ బజార్‌లోని ‘నవయుగ బుక్‌షాపు’తో మొదలయిన అనుబంధం అది. ఈవిధంగా బుక్‌సెల్స్‌ అండ్‌ డిస్ట్రిబ్యూషన్‌తో సాంబశివరావు గారిది నాలుగున్నర దశాబ్దాల పైబడిన అనుభవం. నవోదయ బుక్‌షాపు ప్రారంభించిన తొలిరోజుల్లోనే వారి తోడల్లుడు ఎం.కోటేశ్వరరావు వారితో జత కలిసారు. ఇవాళ నవోదయ అనగానే రచయితలకీ, ప్రచురణకర్తలకీ, పుస్తకాభిమానులకీ సాంబశివరావు, కోటేశ్వరరావులు గుర్తుకు వస్తారు. ఈ ఇద్దరు సోదరులు మూడు దశాబ్దాలుగా కలిసి ప్రయాణించడం కూడా అపూర్వం.
పుస్తకాల వ్యాపారంలో లక్షలు, కోట్లు సంపాదించడం సాధ్యం కాదు. సంపాదించాలనే ఆశతో వారు ఈ రంగంలోకి రాలేదు. కేవలం పుస్తకాల మీద ప్రేమ, సాహిత్యం మీద మమకారంతోనే వారు ఈ రంగంలో నిలిచారు. నవోదయను మూడు దశాబ్దాలుగా విజయవంతంగా నిర్వహిస్తున్నారు. ఏ పుస్తకం ఎక్కడ ఉంటుందో, దాని సారం, సారాంశం ఏమిటో తెలిసినవారు ఈ ఇద్దరు సోదరులు. ఒక్కమాటలో చెప్పాలంటే పుస్తకం ఆత్మ వాళ్ళకు తెలుసు.
నవోదయకు వెళ్ళి పలానా పుస్తకం కావాలని అడిగితే క్షణాల్లో మన ముందు పెడతారు. ఫోనులో అడిగినా వెంటనే చెబుతారు. వందలాదిగా వచ్చే పుస్తకాల సమాచారం వారి మస్తిష్కంలోనే ఉంటుంది. షాపులోనూ ఒక పద్ధతిగా పుస్తకాల్ని డిస్‌ప్లే చేస్తారు. కస్టమర్‌ అడిగిన వెంటనే పుస్తకం చూపించే ప్రతిభ వారి దగ్గర ఉంది. తెలుగు పుస్తకాల షాపుల్లో ఇలాంటి దృశ్యం అరుదు. తమ దగ్గర పుస్తకం లేకుంటే తెప్పించి ఇవ్వడానికి ప్రయత్నిస్తారు. అందుకే దేశంలోనూ, విదేశాల్లోనూ ఉన్న తెలుగు పాఠకులు తమకు అవసరమైన పుస్తకం కోసం కేవలం నవోదయకు మాత్రమే ఫోను చేస్తారు. ఈ నమ్మకం, విశ్వసనీయత పొందిన ఏకైక సంస్థ ‘నవోదయ’. తెలుగునాట పుస్తకాల షాపుల నిర్వహణలో అగ్రగామి.
మారుతున్న కాలానికి అనుగుణంగా ఆరేళ్ళ కిందటనే ఆన్‌లైన్‌ సేవలు ప్రారంభించారు. పుస్తకానికి ఆర్డర్‌ రాగానే వెంటనే పంపించడం అలవాటు. పుస్తకాల అమ్మకంతోపాటు పుస్తకాల ప్రచురణని కొన్నేళ్ళ కిందట ఆరంభించారు. మంచి సాహిత్యం, అరుదయిన ఉత్తమ గ్రంథాలని ప్రచురించేందుకు ప్రాధాన్యమివ్వడం గమనార్హం.
సాంబశివరావు, కోటేశ్వరరావుల్ని రెండు దశాబ్దాుగా గమనిస్తున్నాను. పుస్తకాల మీద అభిమానం, తమ దగ్గరకు వచ్చే కస్టమర్‌ పఠనాభిరుచుల పట్ల అవగాహన వారిలో కనిపిస్తుంది. చాలా ఏళ్ళ కిందట ప్రత్యేకించి ‘మిసిమి’ కోసం వెళ్ళేవాడిని. అలాగే ఢిల్లీ నుంచి వచ్చే ‘సెమినార్‌’ అనే ఇంగ్లీషు మంత్లీ కోసం నవోదయకు రెగ్యులర్‌గా వెళ్ళడం అలవాటు. అనేక సాహిత్య పత్రికల ప్రత్యేక సంచికలు నవోదయలోనే తీసుకున్నాను.
ఇక ‘పాలపిట్ట’ ఆరంభించాక వారితో అనుబంధం మరింత పెరిగింది. పుస్తకాలు, రచయితలు, పాఠకులు, ప్రచురణకర్తలు.. గ్రంథాలయాల పుస్తకాల కొనుగోళ్ళు మొదలయిన విషయాలు మాట్లాడేవారు. సాహిత్యమే గాక అరుదయిన పర్సనాలిటీ డెవలప్‌మెంట్‌ పుస్తకాలు నవోదయలో తీసుకునే వాడిని. ఆ మధ్యన ‘సేపియన్స్‌’ పుస్తకం కొన్నది అక్కడే. జలంధర రాసిన ‘పున్నాగపూలు’ నవలని ఇక్కడే నాలుగుసార్లు తీసుకున్నా. ఎవరయినా పలానా పుస్తకం ఎక్కడ దొరుకుతుందని అడిగితే ‘నవోదయ’కు ఫోన్‌ చేయండని చెబుతుంటాను. కచ్చితమైన సమాచారం అక్కడ లభిస్తుందన్న నమ్మకమే కారణం.
ఈ నమ్మకానికి మూలం ‘నవోదయ’ నిర్వహణ పద్ధతి. సోదరులు సాంబశివరావు, కోటేశ్వరరావు సంస్థని నడిపించడంలో చూపిన శ్రద్ధ, క్రమశిక్షణ, అన్నిటికీ మించి పుస్తకాల పట్ల ప్రేమనే అసలు కారణం. అందుకే ఆ మధ్యన నవోదయకు వెళ్ళినపుడు లాక్‌డౌన్‌ లోనూ, తదనంతర సమయంలోనూ పుస్తకాల కొనుగోళ్ళు, అమ్మకాల గురించి చాలా విషయాలు మాట్లాడాను. ఈ సంభాషణలో తెలుగు పాఠకుల పైన వారికి ఉన్న విశ్వాసం కనిపించింది. ‘పాఠకులున్నారు, ఎక్కడికీ పోలేదు, ఉంటారు, పెరుగుతారు, మంచి పుస్తకానికి పాఠకుల కొదువ లేదు’ అన్న సాంబశివరావు మాటలు రచయితలకీ, ప్రచురణకర్తలకీ స్ఫూర్తిదాయకం.
పుస్తకం నిత్యావసర వస్తువు కాదు. నిజమే. కాని పుస్తకం అవసరం కూడా వుంది. పుస్తకాన్ని నిత్యావసర వస్తువుగా భావించిన కేరళ ప్రభుత్వం రెండోసారి లాక్‌డౌన్‌ కాలంలో అత్యవసర సర్వీసుల కింద పుస్తకాల షాపులు తెరిచి వుంచడానికి అనుమతి ఇచ్చింది. కేరళలో ప్రసిద్ధి చెందిన DC Books వారు కరోనా timeలో పనిచేసిన తీరు scroll.in లో చదివాను. లాక్‌డౌన్‌ సమయాన కొన్నాళ్ళపాటు ‘జొమాటో’ సర్వీసు ద్వారా పుస్తకాలను పాఠకుల ఇంటికి చేర్చారు.
కరోనా కాలపు కష్టాలు, ఈ విపత్తు ప్రభావాలు కొన్నాళ్ళు ఉండొచ్చు. కొంత ఎక్కువకాలమే ఉండొచ్చు. కానీ జీవితం పట్ల ఆశనీ, ప్రపంచం పట్ల భరోసాని ఇచ్చేది పుస్తకాలే. ఆ పుస్తకాలకు తెలుగునాట సిసలయిన చిరునామాగా నిలిచిన ‘నవోదయ’ ప్రయాణం తెలుగువారి జీవితంలో అంతర్భాగం.
పుస్తకాలు రాసినా, ప్రచురించినా, అమ్మకానికి ఓ నెలవు ఉండాలి. ఎక్కడ ఉంటే పుస్తకం నమ్మకంగా పాఠకుడికి చేరుతుందో చెప్పాలంటే ‘నవోదయ’నే అసలయిన కేంద్రం. ఈవిధంగా రచయితలకీ, పాఠకులకీ మధ్య అనుసంధానం గా ఉన్న సంస్థ ‘నవోదయ’. అరుదయిన పుస్తకాల కూడలి. మూడు దశాబ్దాల పైబడిన నవోదయ ప్రయాణం మరింత ఫలవంతంగా ముందుకు కొనసాగాలి. పుస్తకం ఆత్మ తెలిసిన సోదరులు జె.సాంబశివరావు, ఎం.కోటేశ్వరరావులకు అభినందనలు.
నవోదయ బుక్‌హౌస్‌, 3-3-865, ఆర్యసమాజ్‌ మందిర్‌ ఎదుటి సందులో,
కాచిగూడ చౌరస్తా, హైదరాబాద్‌-500 027
ఫోను: 040-24652387, సెల్‌: 90004 13413
Email: navodayabookhouse@gmail.com
- Read full text in పాలపిట్ట, జూన్‌ 2020


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి