1, ఆగస్టు 2020, శనివారం

సత్‌చింతన

అనేకానేక వైరుధ్యాలు, సంక్లిష్టతలు రాజ్యమేలుతున్న కాలమిది. కరోనా విపత్తు నానాటికీ పెరుగుతున్నప్పటికీ మన ఆలోచనల తీరు మారలేదు. వ్యవహారసరళిలో పారదర్శకతకీ, శాస్త్రీయతకీ చోటు కనిపించదు. మరో పదేళ్ళ పాటు కోవిడ్‌-19 ప్రభావం ఉండొచ్చని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరించింది. వ్యాక్సిన్‌ రేపో మాపో వస్తుందన్న మాటలన్నీ నిరాధారమే. అయినా హేతుబుద్ధితో విధివిధానాల రూపకల్పనకు పాలకులు సిద్ధంగా లేరు. ఫలితంగా భిన్నధ్రువాల నడుమ భారతీయుల ఆలోచనాసరళి అపసవ్యతల నడుమ చిక్కుపడింది. ఈమధ్యన రెండు సంఘటనలు నిశ్శబ్దంగా ఆలోచనల్ని అలుముకుంటున్నాయి. ఓ వైపున అయోధ్యలో రామాలయ నిర్మాణ శంకుస్థాపన నేపథ్యాన హిందూత్వ ప్రచార ఆర్భాటం మీడియాని ఆక్టోపస్‌లా ఆక్రమించింది. మరోవైపున నూతన విద్యావిధానం పేరిట మహౌన్నతమైన విద్యాసంస్కరణలకు శ్రీకారం చుట్టినట్టుగా కేంద్రం చెప్పుకుంటున్నది.
పౌరుల్లో శాస్త్రీయ చింతనకీ, ఆలోచనాదీప్తికీ పాదులు వేయాల్సిన పాలకులే రామాలయ నిర్మాణం విధిగా భావించడం ఒక అభాస. రాముని దీవెనలతోనే సమస్త భారతం శాంతి సౌభాగ్యాలతో వర్థిల్లుతుందని నమ్మబలకడం దుర్మార్గ తర్కం. రామాలయ నిర్మాణంపై ఎనలేని ఉత్సాహం చూపించే వారే విద్యావిధానంలో పెనుమార్పులు చేపడుతున్నామని చెప్పడం విరోధాభాస. ఈ రెండూ పకడ్బందీ కుతంత్రాలే. రామాలయం శంకుస్థాపన రోజు ఇంటింటా పూజలు చేయాలని చెప్పడంలో హేతుబద్ధత ఎక్కడ? అలాగే పాఠశాలల్లోని అన్ని స్థాయిల్లో సంస్కృతాన్ని ఐచ్ఛిక భాషగా ప్రవేశపెట్టడంలో ప్రామాణికత ఏమిటి? సంస్కృతం, పాళీ, ప్రాకృతం భాషలని పాఠశాల స్థాయి నుంచి నేర్చుకునే అవకాశం కల్పించడానికి ప్రాతిపదిక ఏమిటి?
ప్రజల మానసిక ప్రపంచాలతో చెరలాటలాడే కుట్రపూరిత వ్యూహాల పెనుదాడి కోవిడ్‌-19 విపత్తు కాలంలోనూ ఆగలేదు. లౌకిక చింతన, శాస్త్రీయ వివేచనలకు ఆస్కారం లేకపోవడం ఈ కాలపు విషాదం. యావత్‌ ప్రపంచంలో అనేకానేక రంగాలకు సంబంధించిన పునర్విశ్లేషణలు జరుగుతున్నాయి. పునర్నిర్మాణాలతో సరికొత్త జీవనసరళికి సమాయత్తమవుతున్నాయి. దీనికి భిన్నంగా తిరోగమనపుటాలోచనలు ఈ జాతికి శోభనిస్తాయా? ఈ దేశ భవితవ్యానికి దిశానిర్దేశం చేస్తాయా? అయోధ్యలో రామాలయ నిర్మాణంతో శ్రేయోరాజ్యం సిద్ధిస్తుందా? ఒక ఎం.పి. చెప్పినట్టు రామనామ జపంతో, మంగళహారతులతో కరోనా తొలగిపోతుందా? ఈ ప్రశ్నల్ని సంధించాల్సిన మీడియా కాషాయశక్తుల వందిమాగధుల దళంగా పరిణమించింది.
ఈ నిర్హేతుక, నిరర్ధక భజన బృందాలే నూతన విద్యావిధానాన్ని వేనోళ్ళ కీర్తించడం విడ్డూరం. నిజానికి దీనిలో నూతనత్వమన్నది లేశమాత్రమైనా లేదు. భారతీయ విలువల పేరిట కాలం చెల్లిన, తర్కరహిత, హేతువిరుద్ధ కట్టుకథల్ని పాఠ్యప్రణాళికల్లో బోధించే ప్రమాదం లేకపోలేదు. అంతేగాక విద్యారంగంలో ప్రైవేటు శక్తుల దూకుడు గురించి ఈ విధానం మౌనం వహించింది. మూడు సంవత్సరాల అంగన్‌వాడీ లేదా ప్రీ స్కూల్‌తో మొత్తం 12 సంవత్సరాల పాఠశాల విద్య ఉంటుందన్నది ఈ విధానం. ఈ పన్నెండు సంవత్సరాల విద్యలో ప్రైవేటు శక్తులకు, కార్పోరేట్‌ బేహారులకు చోటు లేని విధానం రూపొందించే సంకల్పం దీనిలో కనిపించదు.
ప్రీ స్కూల్‌ నుంచి పిజి వరకు చదువుకోవాలనుకునే ప్రతి పౌరునికి ఉచితంగా విద్యని అందించడం ప్రభుత్వాల కర్తవ్యం. దీనిని పక్కన పెట్టి ఎన్ని మాటలు చెప్పినా వ్యర్థం. ఇపుడు ప్రకటించిన విధానంలో వృత్తి విద్యాకోర్సులకు ప్రాధాన్యమిచ్చినట్టు కనిపిస్తుంది. కానీ అది కూడా పేదల్ని, బడుగు బలహీన వర్గాల వారిని ఉన్నత విద్యకు దూరం చేసే కుటిలత్వం. వృత్తివిద్యాకోర్సులు ఏవో చదివి చిన్నచితకా ఉద్యోగాలకు పరిమితమయ్యే అనేకులు ఉన్నతచదువులకు దూరమవుతారు. ఫలితంగా డబ్బులున్న మారాజుల పిల్లలకే ఉన్నత చదువులనే రీతి నిశ్శబ్దంగా ఆమోదం పొందబోతున్నది.
నూతనత్వం, ప్రాంతీయ భాషల ప్రోత్సాహం, సాంకేతిక విద్యా ప్రావీణ్యాల పెంపుదల అనే సొగసయిన పదాలతో విద్యారంగాన్ని భారీ వాణిజ్యంగా రూపుదిద్దే కుట్రకు తెరదీసింది కాషాయ ప్రభుత్వం. దీన్ని గుర్తించకుండా మాతృభాషలకు ప్రాధాన్యం ఇచ్చిందని మురిసిపోవడం అర్థరహితం. 1986లో ప్రకటించిన నూతన విద్యావిధానానికీ, ఇపుడు 2020లో ప్రకటించిన నూతన విద్యావిధానానికీ సారాంశంలో తేడా లేదు. ఆనాడు విద్యారంగంలో ప్రైవేటుశక్తులకు ద్వారాలు తెరిస్తే, ఇవాళ డిజిటల్‌ విద్య పేరున కార్పోరేట్‌శక్తుల గుత్తాధిపత్యాన్ని స్థిరీకరించే మహామేయ కుట్రకు తెరదీశారు. మతశక్తుల, మార్కెట్‌శక్తుల కలయిక ఫలితంగా ఆలోచనల్ని ఉత్తరించే దాష్టీకం పెట్రేగనున్నది.
విరుద్ధశక్తుల సంఘర్షణ అనివార్యం. కానీ పరస్పర ప్రయోజనాలున్న అధికార వర్గాలకీ, మార్కెట్‌శక్తులకీ నడుమ వైరుధ్యం ఏమీ లేదు. ఆ రెంటీ నడుమ ఇదివరకు కనిపించని రేఖలుండేవి. అవి చెదిరిపోయిన సందర్భం ఇవాళ్టి చేదు నిజం. మార్కెట్ల లాభాలకు అనుగుణంగానే సకలరంగాల్ని 'చక్కదిద్దే' పనికి పరిమితమవడం అధికారంలో ఉన్నవారి విధి. ప్రజాస్వామ్యం, రాజ్యాంగం, సర్వోన్నత న్యాయస్థానాల తీరుతెన్నులన్నీ ఈ పరిధిలోనే తచ్చాడు తున్నాయి. ఈ పరిధి సహజమూ, సక్రమమూ, ఆమోదనీయమూ అని నమ్మించేందుకు విద్యావ్యవస్థ కొత్త మోసులెత్తుతున్నది. అది కోట్లకు పడగలెత్తే కుబేరుల ప్రాథమ్యాలకు అనుగుణంగానే ఉన్నది. నూతన విద్యావిధానంపై కార్పోరేట్ల స్వాగత వచనాలే ఇందుకు దాఖలా. ఈ నేపథ్యంలో నిజానిజాల్ని విశ్లేషించగలిగిన వారు అందమైన పదాల గారడీలో కొట్టుకుపోకుండా నోరు విప్పాలి. కరోనా విజృంభణలోనూ జనహితం పట్టని పాలకగణాల కుతంత్రాల్ని విప్పిచెప్పాలి. శాస్త్రీయ వివేచనకీ, ఆలోచనకీ తావునివ్వని విధానాల మర్మం వివరించాలి.  త్రికరణశుద్ధిగా జనపక్షం నిలిచిన విద్యారంగ నిపుణుల కర్తవ్యమిది. 
నవతెలంగాణ ఎడిటోరియల్‌, 02 ఆగస్టు 2020

4, జులై 2020, శనివారం

పుస్తకం ఆత్మ వాళ్ళకు తెలుసు
కరోనా విపత్తు కాలంలో అనేక రంగాలు సంక్షోభానికీ, ఒత్తిళ్ళకు లోన య్యాయి. పుస్తకాలు ప్రచురించేవారు, అమ్మేవారు కూడా ఇందుకు మినహాయింపు కాదు. లాక్‌డౌన్‌ కాలంలో అన్నిటితో పాటు పుస్తకాల షాపులు కూడా మూతబడినాయి. అమ్మకాలు నిలిచిపోయాయి. ఈ నేపథ్యంలో మరి తెలుగు నాట పుస్తకాల షాపుల పరిస్థితి ఏమిటి? ఈ మధ్యన నవోదయ బుక్‌ హౌస్‌కు వెళ్ళినపుడు సాంబశివరావు గారిని అడిగాను. కాస్సేపు పుస్తకాలు, పాఠకులు, కరోనా కాలంలో ప్రచురణకర్తల, పుస్తకాల షాపుల, డిస్ట్రిబ్యూటర్ల పరిస్థితి గురించి మాట్లాడుకున్నాం.
మార్చి 22న లాక్‌డౌన్‌ ప్రకటించిన తరువాత మే పదిహేను వరకు తాము ఇంట్లోనే ఉండిపోయినట్టు సాంబశివరావు చెప్పారు. సాధారణంగా మార్చిలో పుస్తకాల స్టాక్‌ పొజిషన్‌ చూసి రచయితలకు, ప్రచురణకర్తలకు డబ్బులు చెల్లించడం ఆనవాయితీ. దాదాపు పదిహేను రోజుల పైనే ఈ పని ఉంటుంది. ఆకస్మికంగా లాక్‌డౌన్‌ ప్రకటించడంతో ఇంటికి పరిమితమవ్వాల్సి వచ్చింది. అయితే ఆన్‌లైన్‌లో దాదాపు రెండువందల మంది పుస్తకాలకు ఆర్డర్‌ పెట్టారు. వెంటనే పంపడం కుదరదు కాబట్టి, లాక్‌డౌన్‌ అనంతరమే పంపిస్తామని అందరికీ మెయిల్‌ పెట్టినట్టు చెప్పారు. తీరిక సమయం వున్నందున ఈ సమయంలో పుస్తకాలు చదివే అవాటు పెరిగింది. ఇది మంచి పరిణామం. కరోనా కాలంతో సంబంధం లేకుండా చూసినా, తెలుగులో పాఠకులు ఉన్నారు. నేరుగా వచ్చి కొనలేకున్నా, ఆన్‌లైన్‌లో తెలుగు పుస్తకాలు తెప్పించుకునే వారి సంఖ్య పెరుగుతున్నది. లాక్‌డౌన్‌ పీరియడ్‌లో చాలామంది పుస్తకాల కోసం ఫోను చేశారు. ఆన్‌లైన్‌లో ఆర్డర్లు పెట్టారు. వారందరికీ ఇపుడు పంపించామన్నా రాయన. మే 15వ తేదీన మరల షాపు తాళాలు తీశారు. తొలుత స్టాక్‌ పొజిషన్‌కు సంబంధించిన అంచనా పనిలో పదిహేను రోజులు నిమగ్నమ య్యారు. జూన్‌ ఒకటో తేదీ నుంచి వినియోగదారుల కోసం తెరిచి వుంచారు. అప్పట్నించి నవోదయ యధావిధిగా పని చేస్తున్నది.
హైదరాబాద్‌లో 1990 నుంచి నవోదయ బుక్‌హౌస్‌ నడుస్తున్నది. ఈ ముప్పయ్యేళ్ళలో ఇంత ఎక్కువ కాలం (లాక్‌డౌన్‌ సమయం) షాపు మూసేయడం ఇదే మొదటిసారి అన్నారు సాంబశివరావు. దీంతో నిర్వహణా ఇబ్బందులు, సమస్యలు ఉంటాయి, అయినప్పటికీ ఈ సమయాన సిబ్బందికి పూర్తి కాలం వేతనాలు చెల్లించినట్టు చెప్పారు.
‘నవోదయ’ని 1990లో ఆరంభించినప్పటికీ అంతకు ముందు 1974 నుంచే సాంబశివరావు గారికి పుస్తకాల సేల్స్‌తో సంబంధం వుంది. సుల్తాన్‌ బజార్‌లోని ‘నవయుగ బుక్‌షాపు’తో మొదలయిన అనుబంధం అది. ఈవిధంగా బుక్‌సెల్స్‌ అండ్‌ డిస్ట్రిబ్యూషన్‌తో సాంబశివరావు గారిది నాలుగున్నర దశాబ్దాల పైబడిన అనుభవం. నవోదయ బుక్‌షాపు ప్రారంభించిన తొలిరోజుల్లోనే వారి తోడల్లుడు ఎం.కోటేశ్వరరావు వారితో జత కలిసారు. ఇవాళ నవోదయ అనగానే రచయితలకీ, ప్రచురణకర్తలకీ, పుస్తకాభిమానులకీ సాంబశివరావు, కోటేశ్వరరావులు గుర్తుకు వస్తారు. ఈ ఇద్దరు సోదరులు మూడు దశాబ్దాలుగా కలిసి ప్రయాణించడం కూడా అపూర్వం.
పుస్తకాల వ్యాపారంలో లక్షలు, కోట్లు సంపాదించడం సాధ్యం కాదు. సంపాదించాలనే ఆశతో వారు ఈ రంగంలోకి రాలేదు. కేవలం పుస్తకాల మీద ప్రేమ, సాహిత్యం మీద మమకారంతోనే వారు ఈ రంగంలో నిలిచారు. నవోదయను మూడు దశాబ్దాలుగా విజయవంతంగా నిర్వహిస్తున్నారు. ఏ పుస్తకం ఎక్కడ ఉంటుందో, దాని సారం, సారాంశం ఏమిటో తెలిసినవారు ఈ ఇద్దరు సోదరులు. ఒక్కమాటలో చెప్పాలంటే పుస్తకం ఆత్మ వాళ్ళకు తెలుసు.
నవోదయకు వెళ్ళి పలానా పుస్తకం కావాలని అడిగితే క్షణాల్లో మన ముందు పెడతారు. ఫోనులో అడిగినా వెంటనే చెబుతారు. వందలాదిగా వచ్చే పుస్తకాల సమాచారం వారి మస్తిష్కంలోనే ఉంటుంది. షాపులోనూ ఒక పద్ధతిగా పుస్తకాల్ని డిస్‌ప్లే చేస్తారు. కస్టమర్‌ అడిగిన వెంటనే పుస్తకం చూపించే ప్రతిభ వారి దగ్గర ఉంది. తెలుగు పుస్తకాల షాపుల్లో ఇలాంటి దృశ్యం అరుదు. తమ దగ్గర పుస్తకం లేకుంటే తెప్పించి ఇవ్వడానికి ప్రయత్నిస్తారు. అందుకే దేశంలోనూ, విదేశాల్లోనూ ఉన్న తెలుగు పాఠకులు తమకు అవసరమైన పుస్తకం కోసం కేవలం నవోదయకు మాత్రమే ఫోను చేస్తారు. ఈ నమ్మకం, విశ్వసనీయత పొందిన ఏకైక సంస్థ ‘నవోదయ’. తెలుగునాట పుస్తకాల షాపుల నిర్వహణలో అగ్రగామి.
మారుతున్న కాలానికి అనుగుణంగా ఆరేళ్ళ కిందటనే ఆన్‌లైన్‌ సేవలు ప్రారంభించారు. పుస్తకానికి ఆర్డర్‌ రాగానే వెంటనే పంపించడం అలవాటు. పుస్తకాల అమ్మకంతోపాటు పుస్తకాల ప్రచురణని కొన్నేళ్ళ కిందట ఆరంభించారు. మంచి సాహిత్యం, అరుదయిన ఉత్తమ గ్రంథాలని ప్రచురించేందుకు ప్రాధాన్యమివ్వడం గమనార్హం.
సాంబశివరావు, కోటేశ్వరరావుల్ని రెండు దశాబ్దాుగా గమనిస్తున్నాను. పుస్తకాల మీద అభిమానం, తమ దగ్గరకు వచ్చే కస్టమర్‌ పఠనాభిరుచుల పట్ల అవగాహన వారిలో కనిపిస్తుంది. చాలా ఏళ్ళ కిందట ప్రత్యేకించి ‘మిసిమి’ కోసం వెళ్ళేవాడిని. అలాగే ఢిల్లీ నుంచి వచ్చే ‘సెమినార్‌’ అనే ఇంగ్లీషు మంత్లీ కోసం నవోదయకు రెగ్యులర్‌గా వెళ్ళడం అలవాటు. అనేక సాహిత్య పత్రికల ప్రత్యేక సంచికలు నవోదయలోనే తీసుకున్నాను.
ఇక ‘పాలపిట్ట’ ఆరంభించాక వారితో అనుబంధం మరింత పెరిగింది. పుస్తకాలు, రచయితలు, పాఠకులు, ప్రచురణకర్తలు.. గ్రంథాలయాల పుస్తకాల కొనుగోళ్ళు మొదలయిన విషయాలు మాట్లాడేవారు. సాహిత్యమే గాక అరుదయిన పర్సనాలిటీ డెవలప్‌మెంట్‌ పుస్తకాలు నవోదయలో తీసుకునే వాడిని. ఆ మధ్యన ‘సేపియన్స్‌’ పుస్తకం కొన్నది అక్కడే. జలంధర రాసిన ‘పున్నాగపూలు’ నవలని ఇక్కడే నాలుగుసార్లు తీసుకున్నా. ఎవరయినా పలానా పుస్తకం ఎక్కడ దొరుకుతుందని అడిగితే ‘నవోదయ’కు ఫోన్‌ చేయండని చెబుతుంటాను. కచ్చితమైన సమాచారం అక్కడ లభిస్తుందన్న నమ్మకమే కారణం.
ఈ నమ్మకానికి మూలం ‘నవోదయ’ నిర్వహణ పద్ధతి. సోదరులు సాంబశివరావు, కోటేశ్వరరావు సంస్థని నడిపించడంలో చూపిన శ్రద్ధ, క్రమశిక్షణ, అన్నిటికీ మించి పుస్తకాల పట్ల ప్రేమనే అసలు కారణం. అందుకే ఆ మధ్యన నవోదయకు వెళ్ళినపుడు లాక్‌డౌన్‌ లోనూ, తదనంతర సమయంలోనూ పుస్తకాల కొనుగోళ్ళు, అమ్మకాల గురించి చాలా విషయాలు మాట్లాడాను. ఈ సంభాషణలో తెలుగు పాఠకుల పైన వారికి ఉన్న విశ్వాసం కనిపించింది. ‘పాఠకులున్నారు, ఎక్కడికీ పోలేదు, ఉంటారు, పెరుగుతారు, మంచి పుస్తకానికి పాఠకుల కొదువ లేదు’ అన్న సాంబశివరావు మాటలు రచయితలకీ, ప్రచురణకర్తలకీ స్ఫూర్తిదాయకం.
పుస్తకం నిత్యావసర వస్తువు కాదు. నిజమే. కాని పుస్తకం అవసరం కూడా వుంది. పుస్తకాన్ని నిత్యావసర వస్తువుగా భావించిన కేరళ ప్రభుత్వం రెండోసారి లాక్‌డౌన్‌ కాలంలో అత్యవసర సర్వీసుల కింద పుస్తకాల షాపులు తెరిచి వుంచడానికి అనుమతి ఇచ్చింది. కేరళలో ప్రసిద్ధి చెందిన DC Books వారు కరోనా timeలో పనిచేసిన తీరు scroll.in లో చదివాను. లాక్‌డౌన్‌ సమయాన కొన్నాళ్ళపాటు ‘జొమాటో’ సర్వీసు ద్వారా పుస్తకాలను పాఠకుల ఇంటికి చేర్చారు.
కరోనా కాలపు కష్టాలు, ఈ విపత్తు ప్రభావాలు కొన్నాళ్ళు ఉండొచ్చు. కొంత ఎక్కువకాలమే ఉండొచ్చు. కానీ జీవితం పట్ల ఆశనీ, ప్రపంచం పట్ల భరోసాని ఇచ్చేది పుస్తకాలే. ఆ పుస్తకాలకు తెలుగునాట సిసలయిన చిరునామాగా నిలిచిన ‘నవోదయ’ ప్రయాణం తెలుగువారి జీవితంలో అంతర్భాగం.
పుస్తకాలు రాసినా, ప్రచురించినా, అమ్మకానికి ఓ నెలవు ఉండాలి. ఎక్కడ ఉంటే పుస్తకం నమ్మకంగా పాఠకుడికి చేరుతుందో చెప్పాలంటే ‘నవోదయ’నే అసలయిన కేంద్రం. ఈవిధంగా రచయితలకీ, పాఠకులకీ మధ్య అనుసంధానం గా ఉన్న సంస్థ ‘నవోదయ’. అరుదయిన పుస్తకాల కూడలి. మూడు దశాబ్దాల పైబడిన నవోదయ ప్రయాణం మరింత ఫలవంతంగా ముందుకు కొనసాగాలి. పుస్తకం ఆత్మ తెలిసిన సోదరులు జె.సాంబశివరావు, ఎం.కోటేశ్వరరావులకు అభినందనలు.
నవోదయ బుక్‌హౌస్‌, 3-3-865, ఆర్యసమాజ్‌ మందిర్‌ ఎదుటి సందులో,
కాచిగూడ చౌరస్తా, హైదరాబాద్‌-500 027
ఫోను: 040-24652387, సెల్‌: 90004 13413
Email: navodayabookhouse@gmail.com
- Read full text in పాలపిట్ట, జూన్‌ 2020


27, మే 2020, బుధవారం

న‌గ‌రం మ‌ర‌ల గాడిలో ప‌డింది. క‌రోనాకు భీతిల్లి ఇంట‌నే ఉండిపోవ‌టం సామాన్యుల‌కు సాధ్యంకాదు. పూట గ‌డ‌వాలంటే ప‌నులు చేయాల్సిందే. అందుకే అంత‌టా జ‌నాలు క‌నిపిస్తున్నారు. ఎవ‌రి ప‌నుల మీద వారు వెళుతున్నారు. సాయంత్రం ఆరు త‌రువాత కాస్త ఎక్కువ‌గా జ‌నం సంద‌డి వుంది. ఏడు గంట‌ల‌క‌ల్లా ఇంటికి చేరాల‌నే ఆత్రుత‌నే త‌ప్ప మ‌రో కార‌ణ‌మేమీ లేదు. బ‌య‌ట ఎక్క‌డా హోట‌ళ్ళు లేవు, గుక్కెడు నీళ్ళు దొర‌క‌వు. మ‌నం వెళ్ళిన చోట మంచినీళ్ళు కావాల‌ని అడ‌గ‌లేం.  ఈరోజున ఒక ఆఫీసుకు వెళ్ళా. దాహ‌మేస్తోంది. మంచినీళ్ళు క‌నిపించ‌లేదు. ఎలాగో బ‌య‌టికి వెళుతున్నాం క‌దా అని బ‌య‌టికొచ్చి చూస్తే ప‌క్క‌నే ఉండే ఇరానీ చాయ్ హోట‌ల్ లేదు. మ‌లుపు తిరిగితే క‌ని‌పించే టీ బండి కూడా లేదు. వాట‌ర్ బాటిల్ అమ్మే షాపులూ లేవు. అంద‌రూ తిరుగుతున్న‌ట్టే వుంది. కానీ ఎవ‌రికి వాళ్ళు ఒంట‌రి ద్వీపాల్లా క‌నిపించారు. తిరిగి ఆఫీసుకు వ‌చ్చే వ‌ర‌కు దాహం అంటే ఏమిటో తెలిసింది. నా గురించి నేను ఇలా త‌ల‌పోస్తున్నా స‌రే, కాలిబాట‌న మండే ఎండ‌ల‌లో తిరుగాడే వారు, న‌డిచి వెళ్ళే వంద‌ల‌, వేల మంది సంగ‌తి ఏమిటి? క‌రోనా భ‌యంతో ఇపుడే మా ఇంటికి రావ‌ద్దులే అని మొహ‌మాటం లేకుండా చెప్పేస్తున్న‌వారు క‌నిపిస్తున్నారు. ఒక‌రి ఇంట‌కి వెళ్ళ‌లేరు, వేరొక‌ర‌ని పిల‌వ‌లేరు. భౌతిక దూర‌మే కాదు, మ‌నుషుల మ‌ధ్య ఎడం పెరుగుతోంది. ఈ ఎడం ఎందాకా? ఎంత‌కాలం? ఎంతెంత‌దూరం పెద్ద‌మ్మా కోసెడు దూరం చిన్న‌మ్మా అన్న‌ట్టు ఒక‌రికొక‌రు ఆరు అడుగుల దూర‌మే కాదు, అంద‌నంత దూరం పరుగులెత్తుతున్నారు.
ఒక్కొక్క‌రిలో ఒక్కో ర‌క‌మైన ఆందోళ‌న‌... ఇపుడ స‌రే, రేపు ఎలా అన్న చింత‌న ఎంద‌రిలోనో తారాట్లాడుతున్న‌ది. మ‌ధ్య‌త‌ర‌గ‌తి, దిగువ మ‌ధ్య‌త‌ర‌గ‌తి కూడా అంత క్షేమంగా, నిక్షేపంగా ఏమీ లేదు. అమెరికా ఆశ‌లు ఆడియాస‌ల‌య్యాయి.  కెరీర్ గ్రాఫ్‌లో త‌డ‌బాటు పాతికేళ్ళ లోపు వారిలో అల‌జ‌డి రేపింది. స‌గం రోజులే ప‌నిచేయండి. స‌గం జీతం ఇస్తామ‌నే మాట‌లు కొంద‌రికి ఓదార్పు. త‌మ‌కు ఆ మాత్రం ప‌ని కూడా లేదే అని బాధ‌, ఆరాటం... జ‌ర్న‌లిస్టు మిత్రులలోనూ ఎడ‌తెగ‌ని ఆందోళ‌న‌. దిగులు మేఘాలు కమ్ముకున్న ముఖాల‌కు ఏవో న‌వ్వులు పూస్తారే గానీ లోలోప‌ల సుడి తిరిగే దుఃఖం క‌న‌లుతూనే ఉంటుంది. న‌మ్ముకున్న అక్ష‌రం అన్నం పెట్ట‌ద‌ని తెలిసినా పాత్రికేయుల రొద వినిపించే వేదిక‌లు ఉండ‌వు. నింద మోప‌లేరు, ఫిర్యాదు చేయ‌లేరు. త‌మ గురించి తాము చెప్పుకోలేని ఉద్యోగ‌వ‌ర్గం ఏదైనా ఉందంటే అది జ‌ర్న‌లిస్టుల స‌మూహ‌మే. ఈ దేశంలో అత్యంత బ‌ల‌హీన‌మైన సంఘాలు ఏవైనా వున్నాయంటే అవి జ‌ర్న‌లిస్టు సంఘాలే అని ద‌శాబ్దాల కింద‌ట‌నే నా సీనియ‌ర్లు అనేవారు. ఆ మాట ఇప్ప‌టికీ అబ‌ద్ధం కాలేదు. అసంఘ‌టిత రంగాల‌లో ఇది ఒక‌టి. కొంద‌రికి బానే వున్న‌ట్టు వుంటుంది. కానీ అనేకులు నిత్య‌ అభ‌ద్ర‌త మ‌ధ్య‌నే బ‌తుకులు వెళ్ళ‌బుచ్చుతుంటారు. క‌రోనా కాలంలో అభ‌ద్ర‌త తీరుతెన్నులు మ‌రింత‌గా మ‌రింత మంది అనుభ‌వంలోకి వ‌చ్చాయి. చేదు వాస్త‌వాల వెక్కిరింత‌లో ఒక‌రికొక‌రు ఫోన్ల‌లో వ‌ల‌పోసుకోడ‌మే త‌ప్ప ఎవ‌రికీ ఏ భ‌రోసా క‌నిపించ‌దు. క‌రోనా కాలాన కొంద‌రికి కొన్ని నెల‌ల పాటు స‌గం జీతాలే. ఇంకొంద‌రు ఉన్న ఉద్యోగుల నుంచి నిష్ర్క‌మించ‌వ‌లసిన
స్థితి. ఉద్యోగుల లోంచి తొల‌గించ‌వ‌ద్ద‌నే వార్త‌లే కాదు సంపాదకీయాలు కూడా రాస్తాయి ప‌త్రిక‌లు. కానీ త‌మ వ‌ద్ద ఉన్న ఉద్యోగాల నుంచి పంపించే తంత్రం గురించి యోచిస్తారు. ఆ విష‌యం తెలిసినా కిమ్మ‌న‌లేని వారు ఎంద‌రో.
క‌రోనా కాలాన ప‌త్రిక‌ల పాఠ‌కుల క‌న్నా వీక్ష‌కులు పెరిగారు. టీవీల‌ని అతుక్కుపోయే గంట‌ల స‌మ‌యం పెరిగింది. అయినా అక్క‌డ న్యూస్ చానెళ్ళ‌లోనూ బెదురుచూపుల, భ‌యాందోళ‌న‌ల జ‌ర్న‌లిస్టులు ద‌ర్శ‌న‌మిస్తారు. క‌రోనా ధాటిని త‌ట్టుకొని జ‌ర్న‌లిస్టులు కూడా విధులు నిర్వ‌హిస్తున్నార‌ని, వారిని గుర్తించాల‌ని, గౌర‌వించాల‌ని చెబుతారు. గౌర‌వాలు కాదు భ‌ద్ర‌త‌, కాసింత భ‌రోసా కోరుతున్నారు జ‌ర్న‌లిస్టులు. స‌గం జీతాల‌తో అల్లాడుతున్న జ‌ర్న‌లిస్టులు అని ఏ ప‌త్రికా రాయ‌దు. ఏ టీవీ కూడా ప్ర‌సారం చేయ‌దు. ఎంత‌మంది జ‌ర్న‌లిస్టులు రోడ్డున ప‌డ్డారో లెక్క‌లు చెప్ప‌రు.
రెండు నెల‌లుగా జ‌ర్న‌లిస్టు మిత్రులు మాట్లాడుతున్నారు. ఎవ‌రు ఎక్క‌డ ఏం చేస్తున్నారో, ఎపుడు బ‌య‌ట‌కు రావ‌ల‌సి వ‌చ్చిందో చెబుతున్నారు. చిన్న‌పాటి అవ‌కాశం ఎక్క‌డ‌యినా దొరుకుతుందా అని తండ్లాడుతున్నారు. మీడియాలో ప‌నిచేసే రిపోర్ట‌ర్లు, స‌బ్ ఎడిట‌ర్లు, ఆర్టిస్టులు, కార్టూనిస్టులు, ఫొటోగ్రాఫ‌ర్లు, లేఔట్ డిజైన‌ర్లు... ఎన్నో ర‌కాల ప‌నులు చేసేవారు ప‌నుల్లేక అల్లాడుతున్నారు. ఇంటి రుణాలు, ప‌ర్స‌న‌ల్ లోన్స్‌, క్రెడిట్ కార్డు పేమెంట్స్‌, చిరుచిట్టీల వాయిదాలు ఎలా స‌ర్దుబాటు చేసుకోవాలా అని యోచిస్తున్నారు. అయిదు కిలోల బియ్యం, కిలో కందిప‌ప్పు, అర‌కిలో చ‌క్కెర‌,చింత‌పండుతో కూడిన కిట్ల కోసం జ‌ర్న‌లిస్టులు ఎదురు చూడ‌టం లేదు. అవి ఇస్తే కాద‌న‌రు, కానీ కావ‌ల‌సింది ఆర్థిక స‌హాయం... బ్యాంకు ఎకౌంట్ నెంబ‌ర్ తీసుకొని వారికి కొంత మొత్తం డ‌బ్బును బ‌దిలీ చేయ‌డం జ‌ర‌గాలి. ఈ ప‌ని ఎవ‌రు చేస్తారు? ఎవ‌రు చేయాలి? క‌నీసం జ‌న‌వ‌రి 2020 నుంచి ఇప్ప‌టివ‌ర‌కు ఉపాధి కోల్పోయిన జ‌ర్న‌లిస్టుల‌కు తోడ్ప‌డ‌టం అధికారంలో ఉన్న‌వారి విధి, బాధ్య‌త‌. ఈ ప‌ని ఇత‌రులు కూడా చేయ‌వ‌చ్చు.
ఉదాహ‌ర‌ణ‌కు ఫిలిం క్రిటిక్స్ అసోసియేష‌న్ వారు గ‌త రెండు మాసాల్లో ఒక‌సారి అయిదు వేలు, మ‌రోసారి ఎనిమిది వేల రూపాయ‌లు త‌మ స‌భ్యుల అకౌంట్ నెంబ‌ర్ల‌కు న‌గ‌దు బ‌దిలీ చేసింది. ఇలా దాదాపు 90 మందికి వారు ఈ లాక్‌డౌన్ స‌మ‌యాన తోడ్ప‌డ్డారు. జ‌ర్న‌లిస్టు సంఘాల వారు, మీడియా అకాడ‌మీ, ఇత‌ర సంస్థ‌ల వారు ఈర‌క‌మ‌యిన ప‌ని చేయ‌వ‌చ్చు క‌దా. ఎందుకీ ఆలోచ‌న రాదు.  వ‌చ్చినా స్పందించే చొర‌వ ఎందుకు చూప‌రు? ప‌త్రిక‌ల యాజ‌మాన్యాలను అడ‌గ‌లేరు, క‌నీసం ఇలాంటి ప్ర‌యత్నాలు ఎందుకు చేయ‌కూడ‌దు. జ‌ర్న‌లిస్టు మిత్రులు ఈ పూట‌కు బియ్యం లేవ‌ని చింతిల్ల‌డం లేదు. ఇంకా ఇత‌ర అవ‌స‌రాలు ఎన్నో ఉన్నాయి. అవి డ‌బ్బుతో ముడిప‌డిన‌వి. న‌గ‌దు బ‌దిలీ ప‌థ‌కం ఉపాధి కోల్పోయిన జ‌ర్న‌లిస్టుల‌కు కూడా వ‌ర్తింప‌జేయాలి. జ‌ర్న‌లిస్టు సంఘాల నాయ‌కులు, సీనియ‌ర్ జ‌ర్న‌లిస్టులు, ఎడిట‌ర్లు ఈ దిశ‌గా చొర‌వ చూప‌లేరా? ప‌్ర‌భుత్వాల‌నో, ప్ర‌యివేటు సంస్థ‌ల‌నో అడ‌గ‌లేరా?
న‌గ‌రం గాడిలో ప‌డింది. మ‌నుషులు మ‌ర‌ల తిరుగాడుతున్నారు. క‌నుక ఉపాది కోల్పోయిన జ‌ర్న‌లిస్టులు ఏ ప‌చ్చ‌ళ్ళ వ్యాపార‌మో ఏదో ఒక‌టి చేయ‌క‌పోరు. (నిరుద్యోగ కాలంలో కె.ఎన్‌.వై. ప‌తంజ‌లి ప‌చ్చ‌ళ్ళ వ్యాపారం చేశాడు.) కానీ క‌రోనాతో జ‌నాలు భీతిల్లే ఈ ప‌రిస్థితిలో టీ కొట్టు కూడా పెట్టలేరు, ప‌చ్చ‌ళ్ళు త‌య‌రు చేసి అమ్మ‌లేరు. న‌మ్మిన అక్ష‌రాల‌ని ఒక తాపు త‌న్ని మ‌రో వృత్తిలో కుదురుకునే వ‌ర‌క‌యినా ప‌ట్టించుకొనేవారు లేరా? 


8, మే 2020, శుక్రవారం

నగ్నచిత్రం : పాలపిట్ట 2020 లిటరరీ అవార్డులు... ఎప్పుడు? ఎక్కడ?

నగ్నచిత్రం : పాలపిట్ట 2020 లిటరరీ అవార్డులు... ఎప్పుడు? ఎక్కడ?: ఉస్మానియా యూనివర్సిటీ ఐకానిక్ ఆర్ట్స్ కాలేజ్ బిల్డింగ్... 1986 జనవరిలో ఒక సోమవారం, ఉదయం 8:00. ఆర్ట్స్ కాలేజ్ బయట, ముఖ ద్వారం పక్క...